A1 Convention Centre

A1 Convention Centre A1 Convention Centre

24/05/2026

09/05/2026

03/05/2026

❤️ ❤️❤️ ❤️❤️

01/05/2026

Sent from my iPhone
ఆ ‘శిక్షే’ ఒక నేరం!
————————
తమిళ నాడు, సాత్తాంకులం లోని తండ్రీకొడుకుల ‘కస్టోడియల్ డెత్’ లో పోలీసులకు మధురై ట్రయల్ కోర్టు ‘మరణ శిక్ష’ వేసింది. సెక్షన్ 366 CrPC ప్రకారం, ఈ శిక్షను హై కోర్టు ధృవీకరించాలి. ట్రయల్ కోర్ట్ Death Penalty (మరణ శిక్ష) ఇచ్చినప్పుడు హై కోర్ట్ దానిని ఒకసారి పరిశీలిస్తుంది. దీనిని ‘డెత్ రిఫరెన్స్’ అంటారు. లేదా దోషులు హై కోర్టుకు అప్పీలుకు వెళ్ళవచ్చు. దీన్ని ‘క్రిమినల్ అప్పీల్’ అంటారు. ఏమి జరిగినా ఈ ‘డెత్ పెనాల్టీ’నించి వాళ్ళు హై కోర్ట్ లో కూడా బైట పడక పోవొచ్చు. ఎందుకంటే, అసలా ఘటనను ‘సుమోటో’ గా తీసుకుందే హై కోర్ట్. తీసుకొని, కోవిల్‌పట్టి జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ జి. భారతిదాసన్‌ను ‘విచారణ అధికారి’ గా వేసింది. ‘ఆ నివేదికానంతా నేరుగా ధర్మాసనానికి సమర్పించాల’ ని ఆదేశం కూడా ఇచ్చింది.

మెజిస్ట్రేట్ భారతీ దాస్ స్టేషన్ కి వెళ్ళేనాటికి అక్కడ పోలీసుల తప్పుడు రిపోర్ట్ వుంది.
‘వారు అరెస్ట్‌కు ప్రతిఘటించారు (రెసిస్టెడ్ అరెస్ట్)’
‘స్వల్పంగా బలవంతం (మైల్డ్ ఫోర్స్) చేయవలసి వచ్చింది.
‘చిన్న పాటి గాయాలు (సింపుల్ ఇంజరీస్ )మాత్రమే జరిగాయి.’ అంటూ-
‘ప్రాథమిక సమాచార నివేదిక’ ను అబద్ధాలతో నింపారు. ప్రతీ ‘కస్టోడియల్ డెత్’ లోనూ పోలీసులు మొదట ఇలాగే రాస్తారు. వీళ్ళూ అలాగే రాశారు.
ఆ తరువాత ఎఫ్.ఐ.ఆర్ మారింది. ఇండియన్ పీనల్ కోడ్ లోని 302 (హత్య), 342 (అక్రమ నిర్బంధం), 201 (సాక్ష్యాల నాశనం) కింద కొత్త సెక్షన్లతో కేస్ ని మళ్లీ కట్టారు.
మొత్తం నివేదిక హై కోర్టుకి వెళ్ళింది.

ఈ తండ్రీ కొడుకుల హత్య కి ప్రజల్లో విపరీతమైన నిరసన వచ్చింది. అప్పటి ముఖ్యమంత్రి ‘ఎడప్పడి పలని స్వామి’ కి సస్పెన్షన్, ఎక్స్ గ్రేషియాలతో ఆ నిరసనల్ని ఆపలేమని, తనకి అర్థమయ్యింది. ప్రజల్లో పెల్లుబికిన ఈ నిరసన వల్ల ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటుందని గ్రహించీ ఈ కేస్ ని సీరియస్ గా తీసుకోవలసి వచ్చింది. దీన్ని సీ.బి.ఐ కి అప్పజెప్పింది. ఆ సంస్థను ‘తన కింద పని చేయమని’ హై కోర్టు ఆదేశించింది. అంతే కాకుండా ‘ఈ కేస్ ని నిష్పాక్షికంగా దర్యాప్తు చెయ్యమని’ కూడా చెప్పింది.

ఇంతకీ ‘జయరాజ్, బెన్నిక్స్’ అనే ఆ తండ్రీ కొడుకులు చేసిన నేరం ఏమిటి? 2020 లో వచ్చిన మొదటి ‘కరోనా’ లో సాత్తంకులం లో ఉన్న తమ మొబైల్ షాప్ ని తెరిచి వుంచడం!
ఆ తండ్రీ కొడుకులు చేసిన ఘోర నేరం ఇదే!
‘గంటలు మోగించండి!’ అని,
అదే ఏడాది మార్చి 22న, ‘జనతా కర్ఫ్యూ’ ని ప్రధాని మోడీ మొదలెట్టారు.
‘దీపాలు వెలిగించండి!’ అంటూ ఏప్రిల్ 5న, 9 గంటలకు ‘దీపాలూ, మొబైల్ ఫ్లాష్ లైట్లూ’ మనందరి చేత వెలిగించారు.
ఈ రెండింటిలోనూ ఆ తండ్రీ కొడుకులు పాల్గొన్నారు.
ఇంత చేసిన వీళ్ళు జూన్ 19 న, వాళ్ల మొబైల్ షాప్ ని తెరిచి వుంచారు. అదే వాళ్ళు చేసిన తప్పు. వర్తకుల్లో చాలా మంది ఈ తప్పుల్ని సహజంగానే చేస్తారు. అయితే ఏంటి? ఈ పాటి తప్పుకే వాళ్ళను పోలీసులు చచ్చేటట్లు కొడతారా ? (ఏపాటి తప్పుకైనా కొట్టే హక్కు వాళ్లకు రాజ్యాంగం ఇవ్వలేదనేది వేరే సంగతి)
వాళ్ళను కొట్టారు. ఎలా కొట్టారు అంటే చచ్చిపోయేవరకూ కొట్టారు. తగలరాని చోట తగిలి చచ్చి పోయిన సందర్భం కాదది. తగలాలనే కొట్టారు. ‘మల్టీపుల్ ఇంజురీస్’. మెడికల్ భాషలో నే చెప్పాలంటే ‘రెక్టల్ ఏరియా’ అంటే మలద్వారం దగ్గర, ‘టెస్టికల్ ఏరియా’ అంటే వృషణ భాగం దగ్గర, కిడ్నీల దగ్గర ఇంకా అనేక చోట్ల లాఠీలతో కొట్టారు. లోపలా, బైటా ఒకేటి బ్లీడింగ్. ‘ట్రామాటిక్ షాక్’ అంటే ‘అపస్మారక స్థితి’ లోకి ఆ తండ్రీ కొడుకులు వెళ్లి పోయారు. హాస్పిటల్లో చనిపోయారు.

ఇలాంటి ఘటనలు దేశంలో చాలా చోట్ల జరిగాయి. ప్రకాశం జిల్లా చీరాలలో కిరణ్ అనే అతను ‘మాస్క్ పెట్టుకోలేదు’ అని కొట్టారు. అతను చనిపోయాడు. మాస్క్ పెట్టుకోని అందర్నీ కరోనా చంపుకుంటూ పోలేదు. కానీ పోలీసులు మాత్రం అతన్ని చంపేశారు. చచ్చి పోకుండా వుండడం కోసం, ‘మాస్క్ పెట్టుకోవాలి’ అని ఒక పక్క చెబుతూ, దాన్ని ‘పెట్టు కోలేదు’ అనే కారణంతో ఏకంగా చంపెయ్యడం ఏమిటి?

ఇలా ఒక చోట కాదు; పశ్చిమ బెంగాల్ లో ‘ఇంటి నించి బైటకు వచ్చాడ’ ని ఒకతన్ని కొట్టారు. అతను చనిపోయాడు. ‘కాయ గూరలు అమ్ముకొంటున్నాడు’ అని, ఉత్తర ప్రదేశ్ లో ఒకతన్ని కొట్టారు. అతనూ చనిపోయాడు. ‘కర్ఫ్యూని ఉల్లంఘించాడు’ అని, పంజాబ్ లో ఒకతన్ని కస్టడీలోకి తీసుకొని కొట్టారు. అతను ఆ తరువాత చనిపోయాడు. మహారాష్ట్రలో కూడా ఇలాగే జరిగింది. ఒక చోట అని కాదు; ఢిల్లీ, బెంగుళూరు, ఇండోర్, అహమ్మదాబాద్, పాట్నా, కోల్కతా, లక్నో, జైపూర్, భోపాల్, రాంచీ చండీఘడ్ చెన్నై లాంటి అనేక చోట్ల కోవిడ్ పేరుతో పోలీసు హింస, పోలీస్ అవమానం విపరీతంగా జరిగింది. ఒక రకంగా చెప్పాలి అంటే ‘కరోనా హింస’ కన్నా, కొన్ని చోట్ల ‘పోలీస్ హింసే’ ఎక్కువుగా జరిగింది.

దేశంలో జరిగిన వన్నీ ఒక ఎత్తు కాగా ‘సాత్తంకులం తండ్రీకొడుకుల’ పైన జరిగింది ఒక్కటీ ఒక ఎత్తు. ఈ ఘటనలో కోర్టులు స్పందించాయి. ప్రభుత్వం సీబీఐ ని నియమించింది. సీబీఐ కూడా తన పరిశోధనను ఎన్నడూ లేనంత ‘నిష్పక్షపాతం’ గా చేసింది. తమిళ నాడు ప్రభుత్వం కూడా ఆ స్టేషన్ లోని మిగతా సిబ్బంది చేత ‘నిజాయితీ’ గా సాక్ష్యం చెప్పించింది. ఎన్ని ఉద్యమాలు చేసినా ఏనాడూ ఏ చిన్న పోలీస్ మీద కూడా ఏ రకమైన చర్యా తీసుకోని ‘పోలీస్ బాస్’ లు కూడా ప్రభుత్వానికీ, కోర్టులకీ సహకరించారు. అందరూ కలిసి వాళ్లకు శిక్షను వేయించారు. ఇది ముమ్మాటికీ పోలీసు హత్యే. కాదనం. శిక్ష పడాల్సిన కేసే అదీ కాదనం. ఇది ఆహ్వానించ దగ్గ పరిణామమే. ఇది పోలీస్ హింసకి ఒక రకమైన జవాబే. కానీ ఇది చట్టం పట్ల, న్యాయం పట్ల, రాజ్యాంగం పట్ల, పౌరుల పట్ల గౌరవంతో జరిగిందంటే మాత్రం దాన్ని ఖచ్చితంగా నమ్మలేం.

కొన్ని దశాబ్దాలుగా ఈ దేశంలో ఫేక్ ఎన్ కౌంటర్లు జరిగాయి. కస్టోడియల్ డెత్ లూ, లాకప్ డెత్ లూ, జ్యుడీషియరీ డెత్ లూ జరిగాయి. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. (‘నక్సలైట్లని తుదముట్టిస్తాం’ అని తారీఖులు చెప్పి మరీ చేస్తున్నారు.) వాటి మీద సరైన పద్ధతిలో FIR లు కట్టరు. ఇంక్వెస్టులు చేయరు. పోస్ట్ మార్టం సరిగా చేయరు. ‘పోలీస్ స్టేషన్ల లో గానీ, పోలీస్ కస్టడీలో గానీ ఒక మనిషి చనిపోయినప్పుడు, సంబంధిత పోలీస్ పైన ‘హత్యా నేరం క్రింద’ కేస్ ను నమోదు చేయరు. అనుమానాస్పద మృతి (సెక్షన్ 174) క్రింద నమోదు చేస్తారు. ఆ తర్వాత ఏదైనా ప్రజా వొత్తిడులు జరిగితే హత్యా నేరం క్రింద కడతారు. కానీ శిక్షలు ఉండవు.
అంత దాకా ఎందుకు?
ఇదే సాత్తంకులం కి జిల్లా అయిన ‘తూత్కుడి’ లో, 2018, మే నెల 18న, ‘స్టెర్లైట్ ప్లాంట్‌’ కి వ్యతిరేకంగా ప్రజలు నిరసనలు చేపట్టారు. ఇదొక పర్యావరణ సమస్య. ఆ సమస్య మీద ఆందోళన చేసినందుకే పోలీసులు కాల్పులు జరిపారు. 13 మంది మరణించారు. కాల్పుల తర్వాత పోలీసులపైన హత్యా నేరం క్రింద కేస్ కట్టారు. కేస్ ని మాత్రమే కట్టారు. అరెస్ట్ లు లేవు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు లేదు. ట్రయిల్ లేదు. ప్రిజన్ లేదు. ఈ ఘటన మీద కూడా హై కోర్టు సీరియస్‌గానే స్పందించింది. ‘అరుణా జగ్గదీసన్’ అనే జస్టిస్ తో కమిషన్ కూడా నియమించింది. ‘పోలీసులు అతిగా వ్యవహరించారు’ అని, కాల్పులు ‘తప్పుగా నిర్వహించబడ్డాయి’ అని,
‘కొంతమంది అధికారులు దీనికి బాధ్యత వహించాలి’ అని, ఆ కమిషన్ స్పష్టంగా చెప్పింది.
ఈ ఘటన జరిగినప్పుడు కూడా పళనిస్వామే ముఖ్యమంత్రి. దీని మీద కూడా ఆయన సీ. బీ. సీ. ఐ. డీ ని వేశారు. అది ఇంకా కొనసాగుతూనే వుంది. ఫలని స్వామి పోయారు. స్టాలిన్ వచ్చారు. రేపు ఇంకెవరో వస్తారు. అయినా అది ఎన్నటికీ పూర్తికాదు. కారణం అది ‘వొట్టి పోలీసు హత్య’ మాత్రమే కాదు; దాంట్లో రాజ్యం పాత్ర కూడా వుంది. అంటే అది ఒకరకంగా ‘రాజ్య హత్య’. పోలీస్ హత్య మీద అడపాదడపా కొద్ది గా చర్యలు వున్నా, రాజ్య హింస మీద మాత్రం ఒక్కటంటే ఒక్కటి కూడా వుండదు.

మనం తమిళనాడు లో జరిగిన కేస్ గురించే మాట్లాడుకొంటున్నాము కాబట్టి, ఒక్క తమిళనాడునే తీసుకొంటే మనకి తెలిసి, రాజన్ అనే విద్యార్థిని పోలీసులు కస్టడీలోకి తీసుకొని చంపేశారు. విఘ్నేష్ అనే అబ్బాయి ది కూడా ఆ మరణమే. మణికందన్, మురుగేశన్ లు కూడా అలా చనిపోయినవారే. ఇవన్నీ పోలీస్ హత్యలే! వీటిమీద ఏ విచారణలూ లేవు. చర్యలూ లేవు. (వీరప్పన్ ది మాత్రం పూర్తిగా రాజ్య హత్యే. ఒక వేళ రాజ్య అనుమతి లేకుండా పోలీసు స్థాయిలో జరిగిన హత్యే అయినా దాని మీద ఎవ్వరూ మాట్లాడలేని పరిస్థితి. హక్కుల సంఘాలు మాత్రం మాట్లాడాయి అది వేరే విషయం)
పోలీస్ హత్యో, రాజ్య హత్యో (నిజానికి ఈ రెండింటినీ వేరు చేసి మాట్లాడడం అన్ని వేళలా కుదిరే పని కాదు. ‘పదబంధం’ వేరుగా వున్నా వాటి మధ్యన ఉన్న ‘అనుబంధం’ ఒకటే.) అయినా ముందు ఆ ‘తండ్రీ కొడుకుల’ ది ‘ఠాణా హత్య’ గా నిరూపిత మయ్యింది. దీన్ని ‘రేరెస్ట్ కేస్’ గా కోర్ట్ గుర్తించింది. తొమ్మిది మంది పోలీసుల కి ‘మరణ శిక్ష’ ను విధించింది. (వారిలో ‘మురుగన్’ అనే అతను విచారణ సమయంలోనే జబ్బు చేసి చనిపోయారు. దీనిని న్యాయ పరిభాషలో ‘abated’ అంటే, మరణంతో ముగిసినట్లు అని అంటారు.) పోలీసులకి ‘యావజ్జీవిత శిక్ష’ పడ్డ సందర్భాలు ఐతే ఈ దేశంలో కొన్ని ఉన్నాయి. కానీ ‘మరణ శిక్ష’ పడ్డ సందర్భం మాత్రం ఇదే. (బ్రిటీష్ ఇండియా లో కాకుండా.)

ఐతే సమస్య ఇక్కడితో ముగిస్తే బాగుణ్ణు. కానీ ముగియలేదు. అది ఇంకో సమస్యను ముందుకు తెచ్చింది. నేరానికి శిక్ష అనేది మానవీయంగా ఉండాలి. మరణ శిక్షలో మానవీయత లేదు. జీవించే హక్కు లేదు. అది ఇంకో హత్య. హత్యకు హత్య ఎన్నటికీ జవాబు కాదు. ‘కంటికి కన్ను పంటికి పన్ను’ అనేది నాగరికత అనిపించుకోదు.

‘బచ్చన్ సింగ్ వెర్సస్ స్టేట్ అఫ్ పంజాబ్’ కేస్ సుప్రీం కోర్ట్ లో ఉన్నప్పుడు (1980 లో) ‘మరణ శిక్ష రాజ్యాంగ బద్ధ మేనా?’ అనే అంశం మీద కొంత ‘న్యాయ చర్చ’ జరిగింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 (జీవించే హక్కు) కి మరణ శిక్ష అనేది వ్యతిరేకం కాదా? అనే ప్రశ్నని వేసుకొని ‘రేరెస్ట్ ఆఫ్ రేర్ డాక్ట్రిన్’ అని ఒక మార్గ దర్శక సూత్రాన్ని సుప్రీం కోర్టు ఇచ్చింది. ఈ అర్థంలో మరణ శిక్ష అనేది ‘రాజ్యాంగ బద్ధమే’ అని తీర్పుని కూడా ఇచ్చింది.

ఆ తరువాత, కొంత మంది అభ్యుదయ భావాలు ఉన్న న్యాయ మూర్తులు ఈ అభిప్రాయాన్ని ఖండించారు. వారిలో జస్టిస్ వి. ఆర్. కృష్ణయ్య గారు ఒకరు. ‘మరణ శిక్ష అనేది మానవ హక్కులకు విరుద్ధం’ అని తన అభిప్రాయాన్ని చెప్పారు. అలా చెప్పడమే కాకుండా, ఈ ‘రేరెస్ట్ ఆఫ్ రేర్ అనేది సబ్జెక్టివ్‌గా (వ్యక్తిగత అభిప్రాయం ఆధారంగా) మారిపోతుంది’ అని కూడా చెప్పారు. ఆ తరువాత, పి. ఎన్. భగవతి, ఏ. పి. షాహ్ లు కూడా ‘ఇది ఆర్టికల్ 21 కి వ్యతిరేకమే’ అని చెప్పారు. ‘లా కమిషన్ ఆఫ్ ఇండియా’
కూడా తన 2015 రిపోర్ట్ లో ‘మరణ శిక్షను రద్దు చేయాలి’ అని ఒక కీలకమైన సిఫారసు ను తెలియ జేసింది.

తీర్పులు అనేవి సబ్జెక్టివ్ గా వుండ కూడదు; ఆబ్జెక్టివ్ గా వుండాలి. వేరే శిక్ష లకి ‘నేరస్మృతి, శిక్షా స్మృతి’ అనేవి ప్రామాణికంగా వుంటాయి. (ఒక్కొక్కసారి ‘నేను నమ్ముతున్నాను’ అని కొంత మంది జడ్జీలు ‘అరుదైన తీర్పులు’ ఇస్తుంటారు. అది వేరే సంగతి.) కానీ మరణ శిక్షల్లో ‘అత్యంత అరుదైన’ అనే భావన పూర్తిగా జడ్జీల ఆలోచనా రీతిన బట్టి వుంటుంది.

భారత రాజ్యాంగం తయారీ సమయంలో (1946-49లో) కూడా ‘మరణ శిక్ష’ పైన పెద్దగా చర్చ జరగ లేదు. దానికొక కారణం: దేశంలో తీవ్రమైన నేరాలు ఉన్నాయి కాబట్టి, ప్రభుత్వం వద్ద ఒక ‘కఠిన శిక్షా సాధనం ఉండాలి’ అని అనుకోవడం! ఒకరిద్దరు జీవించే హక్కు గురించీ మాట్లాడారు గానీ, అది ఎవ్వరూ పెద్దగా వినిందీ లేదు; దాన్ని అంతకన్నా సీరియస్ గా చర్చిందీ లేదు. ‘ప్రాణం తీసే హక్కు మనుషులకు లేదు’ అని గాంధీ గారు అన్నారు గానీ, భగత్ సింగ్ ని అతని మిత్రుల్ని ఉరి తీసే సమయంలో మౌనం వహించారు. పైగా ‘భగత్ సింగ్ ని మీ చట్టాల ప్రకారం ఉరితీస్తే అదేదో కరాచీ లో జరగబోతున్న కాంగ్రెస్ కి ముందుగా నే శిక్షించండి’ అనే ఒక సలహా కూడా ఇచ్చారు అనే అభియోగం కూడా ఆయన మీద వుంది.

అంబేద్కర్ అయితే ‘ప్రాణ హక్కు ఉంది — కానీ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ప్రకారం ఆ హక్కును తీసెయ్య వచ్చును’ అని అన్నారు.
ఇందిరాగాంధీ కి మరణ శిక్షలు చాలా అవసరం కాబట్టి, 1967 లో ‘లా కమిషన్’ కూడా ఈ శిక్ష ను సమర్థించింది. చాలా బలంగా సమర్ధించింది.

మరణ శిక్షకు వ్యతిరేకంగా సీరియస్ గా తత్వ చర్చను ప్రారంభించినవారిలో 18వ శతాబ్దానికి చెందిన యూరప్ ఫిలాసఫర్ ‘చెజారే బెక్కారియా’ ప్రధములు. 1764లో ఆయన రాసిన ‘ఆన్ క్రైమ్స్ అండ్ పనిష్మెంట్స్’ లో - ‘మనిషి ప్రాణాన్ని తీసే హక్కు ప్రభుత్వానికి ఉండకూడదు అనీ, మరణ శిక్ష నేరాలను తగ్గించదు అనీ, ఇది క్రూరమైన శిక్ష’ అనీ రాశారు. నిజానికి ‘మరణ శిక్ష వ్యతిరేక ఉద్యమానికి’ మొదటి బలమైన పునాది ఇదే. మొదటగా మాట్లాడింది కూడా బెక్కారియనే . ఆయన మాటలు చాలా కాలం వరకూ మాటలు గానే మిగిలిపోయినప్పటికీ, వాటిలో అంతర్లీనంగా దాగివున్న ‘మానవీయకోణం’ తనపని తాను చేసింది. 18 వ శతాబ్దంలో మొదలైన ‘ఆలోచన’ 19 వ శతాబ్దం నాటికి ‘ఆచరణ’ లోకి వచ్చింది. మొదటిగా తన దేశ చట్టాలనించి మరణ శిక్షను ‘వెనిజులా’ అనే దేశం తొలగించింది. ఇప్పుడు వంద దేశాల్లో మరణ శిక్షలు లేవు.

మళ్లీ ఇప్పుడు ‘సాత్తాంకులం తండ్రి కొడుకుల లాకప్ డెత్’ లో పోలీసులకు పడ్డ ‘మరణ శిక్ష’ గురించీ మాట్లాడుకుంటే, ఇదొక భిన్నమైన కేస్. దీంట్లో నేరస్థులు పౌరులు కాదు; పోలీసులు. నిత్యం పౌర హక్కుల్ని హరించే పోలీసులు. పౌరుల ప్రాణాల్ని తీసే పోలీసులు. రాజ్యంలో భాగమైన పోలీసులు. ఇలాంటి వ్యక్తులకు శిక్ష పడితే దాన్ని తగ్గించమని అనగలమా? అనే భావన ఎక్కువ మందికి వుంటుంది. కానీ అనాలి. మనం ఒక ప్రిన్సిపుల్ మీద ‘చట్టాల్ని మార్చాలి’ అనేటప్పుడు దానికి మినహాయింపుల్ని ఇవ్వ గలమా? అలా ఇచ్చుకుంటూ పోతే, అలాంటి వాదన ‘తాత్విక సంక్షోభం’ లో, ‘తాత్విక వైరుధ్యం’ లో పడిపోదా?

ఆ తండ్రీ కొడుకుల్ని ఆ తొమ్మిది మంది పోలీసులు చంపేశారు; చాలా క్రూరంగా. అంతే క్రూరంగా వారిని ఇప్పుడు తమిళనాడు కోర్టు చంప బోతుంది. మరణ శిక్షల్ని తీసేసిన చోట నేరాలు ఎలా గైతే అమాంతంగా పెరగ లేదో; ఆ శిక్షని వుంచిన చోట కూడా నేరాలు ఒక్క సారిగా తగ్గేది ఏమీ వుండదు. నేరాలకూ శిక్షలకూ చాలా తక్కువ సంబంధం వుంటుంది. నేరాలకు వ్యవస్థిత పరిస్థితులతోనే ఎక్కువ సంబంధం వుంటుంది. ఈ విషయం సిద్ధాంత చర్చ ద్వారా కన్నా అనుభవ పూర్వకంగానే మనకి ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది.
శిక్ష పడ్డవాళ్లు హిందువులా, క్రైస్తవు లా, ముస్లిం లా, దళితులా, అగ్ర వర్ణాల వాళ్ళా, మహిళలా, పురుషులా, సైనికులా, పోలీస్ లా, హంతకులా, రేపిస్టు లా అని కాదు; వాళ్ళు మనుషులా కాదా అనేది మాత్రమే చూడాలి. ‘మనుషుల్లా ప్రవర్తించని మృగాలను మనుషుల్లాగా ఎందుకు చూడాలి?’ అనే వాదం కూడా ఒకటి వుంది. అవును. అది కూడా వుంది. అలా వాళ్ళని చూడలేం కాబట్టే, ఆ మృగాలకు బోనులు (జైళ్లు) ఉన్నాయి. 511 సెక్షన్లు ఉన్నాయి. అనేక శిక్షలు ఉన్నాయి. నేరగాళ్లని శిక్షించడానికి అవి చాలు. ఈ శిక్షల్లో ఎంతో కొంత నాగరికత వుంది. మరణ శిక్షలో అలాంటి నాగరికత లేదు.
‘ఆదిమ ప్రతీకార నీతికి ఆఖరి అవశేషం మరణ శిక్ష’ అని బాలగోపాల్ గారు అన్నారు. అంతే కాదు; ‘ అసలా శిక్షే ఒక నేరం’ అని కూడా ఆయన అన్నారు.

‘చట్టానికి చంపే హక్కు వుండకూడదు. చనిపోయిన వారిలో నిర్దోషులు వుంటే వాళ్ళు ఇంక తిరిగి రారు.’ లాంటి వాదాలతో మానవ హక్కుల సంఘాలు అనేక దశాబ్దాలుగా మరణ శిక్షల్ని వ్యతిరేకిస్తున్నాయి. ఆ తొమ్మిది మందికీ (ఇంకా అలాంటి క్రూర పోలీసులకీ) తాము ఎంతటి దయా హీనులమో తెలియాలి అంటే వాళ్ళ తలల్ని ‘తలారీ’ కి అప్పజెప్పడం కాదు; వాళ్లను జీవించ నిద్దాము! జీవించినంత కాలమూ శిక్షిద్దాము! దాన్ని ‘యావజ్జీవిత శిక్ష’ గా మారుద్దాం!

Address

Old Gunture Road
Ongole
523001

Alerts

Be the first to know and let us send you an email when A1 Convention Centre posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Establishment

Send a message to A1 Convention Centre:

Share