26/11/2020
భారీ వర్షాలు, ప్రజల స్థితిగతులపై గంట గంటకూ అధికారులుతో సమీక్షిస్తున్న చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి.
రాయచోటి పట్టణంలో సరైన నివాసాలు లేని పేదవారికి, ప్రమాదకర గృహాలలో నివసిస్తున్న వారికోసం పునరావాస కేంద్రాల ఏర్పాటు
రాయచోటి ప్రాంతంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలుపైన, ప్రజల స్థితిగతులపైన గంట గంటకూ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి నియోజకవర్గంలోని అధికారులుతో సమీక్షిస్తున్నారు. అధికారులు చేపడుతున్న చర్యలను, ప్రజలను అప్రమత్తం చేస్తున్న విధానాలును , బాధితులకు భోజన, ఇతర వసతులపై ఆయన ఆరా తీస్తున్నారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ దెబ్బతిన్న ఇళ్ళు, ప్రమాదకరంగా, అనుమానంగా ఉన్న ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు. రాయచోటి పట్టణంలో సరైన నివాసాలు లేని పేద వారికి, ప్రమాదకర గృహాలలో ఉన్న వారికోసం పట్టణం లోని షాదీఖానా, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ లలో పునరావాసా కేంద్రాలును ఏర్పాటు చేశామన్నారు. వారికి భోజన,తదితర వసతుల ఏర్పాటుకు దాతలు ముందుకు వచ్చారన్నారు. ఇప్పటికే జిన్నా సంస్థ వారు భోజనాన్ని అందిస్తున్నారన్నారు. వెలిగల్లుకు 10 వేల క్యూసెక్కుల వరద నీరు రికార్డు స్థాయిలో చేరుతోందన్నారు. ఇదే తరహాలో వరద నీరు వస్తే శుక్రవారం మధ్యాహ్నానికి ప్రాజెక్ట్ గేట్లు ఎత్తే అవకాశం ఉందన్నారు.కంచాలమ్మ గండి, గంగనేరు, కుషావతి ప్రాజెక్ట్ లలోకి వరద నీరు కూడా అధికంగా చేరుతోందన్నారు.చెరువులు, వాగులు, వంకల దగ్గరికి పిల్లలు, వృద్ధులు వెళ్ళొద్దని ఆయన సూచించారు. వీధుల లోని విద్యుత్ స్తంభాలును ఎవ్వరూ తాకవద్దన్నారు. రెవెన్యూ, పంచాయితీ రాజ్, మున్సిపాలిటీ, పోలీసు, ఇరిగేషన్, వ్యవసాయ తదితర శాఖల అధికారులు ప్రజలును ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ, అవసరమైన చోట సహాయక చర్యలు చేపట్టాలన్నారు.చాలా ప్రాంతాలలో వాగులు, వంకలు ఉధృత ప్రవాహ కారణంగా రోడ్లను దాటే క్రమంలో వాహనదారులు, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు.జ్వరాలు,తదితర జబ్బులు ప్రబలకుండా వైద్య ఆరోగ్యశాఖ చర్యలు చేపట్టాలని శ్రీకాంత్ రెడ్డి ఆదేశించారు.