16/06/2026
హైదరాబాద్‌లోని మూసాపేట్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మూసాపేట్ గూడ్స్ షెడ్ ప్రాంతంలోని ఒక ఎలక్ట్రిక్ వాహనాల (EV) గోదాంలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. గోడౌన్‌లో పెద్ద సంఖ్యలో బైక్‌లు, వాటికి సంబంధించిన లిథియం బ్యాటరీలు ఉండటంతో మంటలు క్షణాల వ్యవధిలో విస్తరించాయి. బ్యాటరీలు వరుసగా పేలడంతో పెద్ద ఎత్తున శబ్దాలు వస్తూ మంటలు ఆకాశమంత ఎత్తున ఎగిసిపడుతున్నాయి.
ఈ ప్రమాదం వల్ల చుట్టుపక్కల ప్రాంతాలు దట్టమైన నల్లటి పొగతో నిండిపోవడంతో స్థానికులు ఊపిరాడక, భయభ్రాంతులకు గురై రోడ్లపైకి పరుగులు తీశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో సుమారు 50కి పైగా సరికొత్త ఈవీ వాహనాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు (షార్ట్ సర్క్యూట్ లేదా మరేదైనా సాంకేతిక లోపం) ఇంకా తెలియాల్సి ఉంది.